నల్లగొండ మున్సిపాలిటీలో అధికారుల ‘మురికి’ పనులు..!
నల్లగొండ మున్సిపాలిటీలో టెండర్ల గోల్ మాల్..
పూర్తి అయిన పనులకు మళ్లీ మళ్లీ టెండర్లు…
ట్రాఫిక్ జంక్షన్లలో ‘గ్రీన్ షేడ్ నెట్స్’ ఏర్పాటుకు, మురికి కాల్వల ‘సిల్ట్ క్లీనింగ్’ పనుల పేరుతో దందా
బోగస్ బిల్లులకు, నకిలీ పనులకు ఫేమస్ నల్గొండ మున్సిపాలిటీ!
టెండర్ల పేరుతో ప్రజాధనాన్ని దోచి.. కాంట్రాక్టర్లు, అధికారులు పంచుకునే కుట్రకు స్కెచ్..
స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఇదేనా మీ పారదర్శకత?
పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి
‘రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు’ అనే సామెతను తలపిస్తోంది నల్గొండ మున్సిపాలిటీ అధికారుల పనితీరు. మున్సిపాలిటీలో ఇటీవలే పూర్తి చేసిన మురుగు కాలువల తవ్వకాలు (సిల్ట్ క్లీనింగ్) కానీ, పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ లలో ప్రయాణికులకు ఎండ వేడిమి తగలకుండా ఉండేందుకు ‘గ్రీన్ షేడ్ నెట్’ లు ఏర్పాటు చేశారు. మళ్లీ అదే ప్రాంతాల్లో వీటి నిర్మాణం కోసం తిరిగి టెండర్లు పిలవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
ఒక మున్సిపాలిటీలో సగటున 100 నుండి 300 మురికి నాళాలు ఉంటాయి. వాటిలో పేర్కొన్న మట్టి, చెత్త తొలగించేందుకు లక్షలాది రూపాయల బడ్జెట్ కేటాయించబడుతుంది. కానీ సిల్ట్ తీయకుండానే తీసినట్లుగా చూపించి బోగస్ బిల్లులు, పాత ఫోటోలు, వాహనాల వాడకం బిల్లులు సమర్పించి సంబంధిత పాలకమండలి నుండి ఆమోదింపచేసుకోవడం పలు మున్సిపాలిటీలో జరుగుతుంటోంది. వీటన్నిటికీ నల్గొండ మున్సిపాలిటీ అతీతమేమీ కాదు. అవినీతికి నల్లగొండ మున్సిపాలిటీ పెట్టింది పేరు. గతంలో ఈ విషయం నిరూపణ అయింది. ఇక్కడ కొంతమంది బిల్ కలెక్ట్ చేసే వర్కర్లు మున్సిపాలిటీకి చెందిన బోగస్ రశీదు పుస్తకాలు సొంతంగా ముద్రించుకొని, లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసి, అడ్డంగా దొరికిన చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది.
‘కుక్క తోక వంకర’ అనే నానుడి నుండి నల్లగొండ మున్సిపాలిటీ అధికారులు బయటికి రాలేకపోతున్నట్లు స్పష్టం అవుతోంది. అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో చేతులు కలిపి, కొంతమంది అధికారులు నకిలీ టెండర్ల బాగోతానికి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వేసవికాలం సీజన్ చివరి మే మాసంలో సుమారు 15-20 రోజుల పాటు పట్టణంలోని స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్, క్లాక్ టవర్ సెంటర్ల వద్ద తాత్కాలికంగా ‘గ్రీన్ షేడ్ నెట్’ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ జూన్ మాసం ప్రారంభం కాకముందే సంబంధిత ‘గ్రీన్ షేడ్ నెట్స్’ వాటికోసం ఇరువైపులా నాటిన ఇనుప రాడ్లు మొత్తం రాత్రికి రాత్రే పూర్తిగా మున్సిపల్ సిబ్బంది తొలగించేశారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేశారో? ఎందుకు తొలగించారో? మున్సిపల్ అధికారులే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. వీటి ఏర్పాటుకు ముందు అధికారులు టెండర్లు పిలిచిన దాఖలాలు లేవని తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు వర్షాకాలం ప్రారంభ దశలో తాజాగా మళ్లీ ఇప్పుడు ‘గ్రీన్ షేడ్ నెట్స్’ ఏర్పాటు కోసమని మున్సిపల్ అధికారులు నిస్సిగ్గుగా టెండర్లు ఆహ్వానించడం హాస్యాస్పదంగా మారింది. 8 లక్షల విలువైన ఈ పనులకు టెండర్ దాఖలు చివరి తేదీ జూన్ 15 గా వెబ్ సైట్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతానికి నల్లగొండ మున్సిపాలిటీ మరో వర్క్ టెండర్ ను ఆన్ లైన్లో ప్రకటించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాళాలు, మురుగు కాలువల్లో పేర్కొన్న ‘సిల్ట్ క్లీనింగ్’ కోసమని సుమారు 50 లక్షల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. సదరు టెండర్ దాఖలు చివరి తేదీ జూన్ 19 గా స్పష్టం చేశారు. ఈ పనులకు సంబంధించి పట్టణంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ‘సిల్ట్ క్లీనింగ్’ పనులు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల ప్రస్తుతం క్లీనింగ్ పనులు నడుస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులు ప్రకటిస్తున్న ఈ టెండర్లపై అందరికీ పలు రకాలైన అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. పనులు పూర్తయిన వాటికి టెండర్లు ప్రకటించడం వెనుక అధికారులు, కొంతమంది చోటామోటా నాయకులు కలిసి ప్రజాధనం లూఠికీ భారీ స్కెచ్ వేసినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎవరికోసం ఈ నకిలీ టెండర్లు..?
నల్గొండ మున్సిపాలిటీలో అధికారుల వ్యవహారం పట్ల ప్రజలు, కొద్దిమంది కాంట్రాక్టర్లు చీదరించుకుంటున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులకు మళ్లీ బిల్లులా..? అనే ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మున్సిపాలిటీలో జి.ఐ.ఎస్ మ్యాపింగ్ సిస్టం ఉందో లేదో వారికే తెలియని దుస్థితి! ఈ టెండర్లు ఏ కాంట్రాక్టర్ ఖజానా నింపడం కోసమో తేలాల్సి ఉంది. ఇందులో అధికారుల వాటా ఎంతనో బహిరంగం కావలసి ఉంది!
స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఇదేనా మీ పారదర్శకత..?
సాధారణంగా రాజకీయ పాలకమండలి ఉన్నప్పుడు నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉండడం సర్వత్రా తెల్సిందే. కానీ స్పెషల్ అధికారుల పర్యవేక్షణలో కూడా ప్రజాధనం ఈ విధంగా దోపిడీకి గురికావడం శోచనీయం, క్షమించరాని నేరం. ఈ నకిలీ టెండర్ల వెనుక ఉన్న అసలు బాగోతం ఏమిటో జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు


